Monday, 29 March 2010

తల్లి హృదయం...




కంటి పాప కు కనురెప్ప లా
చంటి పాప ను కాపాడేది 'అమ్మ '

వెలుగు ను ఇస్తూ కరిగిపోయే కొవ్వొత్తి లా
ప్రేమ ను పంచేది 'అమ్మ '

కనుమరుగైన అల ను అక్కున చేర్చుకొన్న కడలి లా
ఎప్పటికి నన్ను చేరదీసేది 'అమ్మ '

కష్టాలలో ఆదుకొనేది 'అమ్మ '
కన్నీళ్ళలను పంచుకొనేది 'అమ్మ '

నేను ఇల్లాలి నైతే పొంగిపోయింది 'అమ్మ '
నేను తల్లి నైతే మురిసిపోయింది 'అమ్మ '

నేను 'అమ్మ ' అయిన తరువాతే అర్థం చేసుకోగలిగాను
తల్లడిల్లే తల్లి హృదయం
తపన పడే ఈ ప్రేమ మూర్తి ప్రేమానురాగం!!

Friday, 26 March 2010

పసివాడు-బాలయోగి..



చిన్నారి మహా యోగి..
నిద్రలో కూడా వాడి చేతులు జ్ఞాన ముద్రలో ఉంటాయి..
చిన్నారి సర్వసంఘ పరిత్యాగి..
ఒంటి మీద నూలుపోగు లేకుండా వీధి అంతా చుట్టేస్తాడు..
పసివాడు వశీకరణ విద్యలో ఆరితేరినవాడు..
వాడి బోసి నవ్వులు కనికట్టు మంత్రాలు..
చిట్టి తండ్రి మహా పండితుడు..
ఎప్పుడు ఏదో ఒక వేదం వల్లే వేస్తూ ఉంటాడు వుంగా వుంగా అంటు..
ఆ గడుగ్గాయి గొప్ప సాధకుడు..
ఎవరో సుప్రభాతం పాడినట్టు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొంటాడు..
ఆ పసివాడు ఎ హిమలయలకో బయల్దేరి దరి తప్పి
మన ఇంటికి వచ్చిన బాల యోగి కదా...!!

ఓ అమ్మగా నేను..



నువు పలికే కొత్త కొత్త మాటలకి
అర్థాలు మార్చే నిఘంటువునౌతా...
నువు అడిగే వింత ప్రశ్నలకు జవాబులు వెతికే
విజ్ఞాన సర్వస్వం అవుతా...
నువు వేసే తప్పటడుగులు సవరించేందుకు
నీ చుట్టూ చూపుల ప్రాకారం నిర్మిస్తా..
ఎదురుదెబ్బలు నీకెదురు కాకుండా
నా అరిచేతుల మీదుగా నీ అడుగులు వేపిస్తా...
గాఢ నిద్రలో బూచాడు నీ దరికి రాకుండా
తీపి కలల ఊయలలో నిన్ను జోకొడతా..
నువ్వు వికసించే రేపటి సౌధం కొసం
పునాది రాళ్ళు పేర్చే నిత్య శ్రామికురాలిని అవుతా..
ఇవన్నీ ఎందుకంటే.....
´´అమ్మా అని నువ్వు నన్ను అల్లుకున్నందుకు´´